March 07, 2014

ఒక వర్షం కురిసిన మధ్యాహ్నం



ఒక్క రోజులో ఎంత ప్రపంచాన్ని చూడగలం
నువ్వు కలవగలిగిన మనుషులంత
లేదా, నువ్వు కౌగిలించుకున్న హృదయమంత

ఒకడుంటాడు, భూమితో మాట్లాడినవాడు
సమస్త దుర్మార్గాల్ని – నువ్వు చూడనివి, చూసి వదిలేసినవి -- 
ఏవో కొన్ని ముతక రంగుల కుంచెలతో
కోపంతోనూ, వెక్కిరింతతోనూ
గీసి నీ ముందుకు గిరాటేస్తాడు
ఇక నువ్వు తప్పించుకోలేవు, సబ్ ఠీక్ హై అని
మొహం తిప్పుకు వెళ్లిపోలేవు

ఒక్క జీవితంలో నువ్వు ఎంత తెగువను చూడగలవు
నువ్వు చూడగల యుధ్ధాలంత
లేదా, నువ్వు తడిమిన హృదయమంత

ఒకడుంటాడు, ఎప్పటికీ ప్రజలవైపు నిలబడినవాడు
మనుషుల్ని కలవడంతోనే పులకించినవాడు
బహుశా, ఆ మధ్యాహ్నం అక్కడ దుఖ్ఖమేదో
కనిపించని ఏరుగా ప్రవహించి వుండొచ్చు

కానీ, అతడు కొలిమిలోంచి వచ్చిన మనిషి కదా
తనని తాను చెక్కుకుని నిర్మించుకున్నవాడు కదా
దుఖం ఎలా వస్తుంది ఎవరికైనా

అక్కడ అతడు, అతడి తెగువ
ఒక వేసవి కాలపు మొదటి రోజు మధ్యాహ్నం
ఒక బ్రహ్మాండమైన వర్షంలా కురుస్తారు
ఇక నువ్వు తడవకుండా ఎలా వుండగలవు

(శేఖర్ కోసం)

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...