October 18, 2015

సుబ్బరాయుడి మాస్టారి జర్నలిజం పాఠాలు – 1



  ఈమధ్య కొత్తగా రాబోతున్న ఓ టీవీ ఛానెల్ వాళ్ళు బిజినెస్ జర్నలిజం గురించి కొన్ని క్లాసులు చెప్పమన్నారు. వినడమే తప్ప చెప్పడంరాని వృత్తిలో వున్నాను కాబట్టి చెప్పడం మీద నాకంత ఆసక్తి వుండదు. కానీ జర్నలిజం లోకి కొత్తగా వస్తున్న వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పొచ్చని, చెప్పాలని సరే చెప్తా అన్నాను. వాళ్ళు మళ్ళీ అన్నీ ఫీల్డ్ లోనే నేర్చుకోకుండా, కొన్నైనా చెప్పవచ్చనీ కూడా అనిపించింది. క్లాసు మధ్యలో ఏదో ప్రస్తావన వస్తే మీకు పతంజలి గారు తెలుసా అనడిగాను.
తెలీదని చెప్పారు.
  మొదట ఆశ్చర్యం కలిగింది కాని
, వెంటనే అనిపించింది, వీళ్ళు మిల్లీన్నియల్స్’. అంటే గత 20 ఏళ్లలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు పెరిగిన సమాజం ఎలా వున్నది, వీళ్ళకు అవన్నీ తెలియడానికి? అయితే కొత్తగా ఏదైనా రంగంలోకి వచ్చే వాళ్ళకి ఆ రంగంలోని గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళు  చేసిన కృషి గురించి తెలియకపోతే ఎలా?
  ఇక ఇటీవలి కాలపు పతంజలి గారి గురించే తెలీకపోతే సుబ్బరాయుడి గారి లాటి వాళ్ళ గురించి ఇంకేం తెలుస్తుంది? పతంజలి లాటి వాళ్ళకే గురుతుల్యుడైన సుబ్బరాయుడి గురించి కొత్తతరం వాళ్ళకే కాదు జర్నలిజంలో పది, పదిహేనేళ్ళగురించి వున్నవాళ్లకైనా తెలుసా? కష్టమే.
   నిజానికి ఆయన గురించి నాకు తెలిసిందే చాలా తక్కువ. ఆంధ్రా యూనివర్సిటీలో జర్నలిజం చదువు పూర్తి చేసి
, ‘ఉదయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజంలో సీటు కోసం పరీక్ష రాసి హైదారాబాద్ చేరుకున్నా. కవి విల్సన్ సుధాకర్, జర్నలిస్ట్ రవికాంత్ రెడ్డి, కవీ-జర్నలిస్ట్ బొబ్బిలి శ్రీధర్ అక్కడ నా సహచరులు.
  రామచంద్రమూర్తిగారు క్లాసులు స్టార్ట్ చేసి
, జర్నలిజం గురించి కొంత చెప్పి, సుబ్బరాయుడి గారిని పరిచయం చేసి వెళ్ళిపోయారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్లా , పండు జుత్తు, కొంచెం సీరియస్ గా కనిపించిన ఆయన్ని చూసి, యవ్వన కాలపు రెక్లెస్ నెస్ తో జర్నలిజంలో గోల్డ్ మెడల్ కొట్టిన నాలాటి వాళ్ళకి ఈయనేం చెప్తార్లే అనుకున్నాను.  ఏవో కొన్ని పీటీఐ కాపీలను ఇచ్చి అనువాదం చెయ్యమన్నారు. బహుశా, మేం ఎక్కడ వున్నామో తెలుసుకోడం కోసమనుకుంటా.
  అన్నీ చూసి
, ఇలా అన్నారు: “తెలుగుని తెలుగులా రాయండి. ఇంగ్లీషుని ఇంగ్లీష్ కే పరిమితం చేయండి. తెలుగులోకి తీసుకురాకండి.” అని ఓ ఉదాహరణ చెప్పారు. ఎవరైనా ఏదైనా అంటారు, లేదా చేస్తారు. అంతే కానీ, ‘అనడం జరిగింది’, ‘చెయ్యడం జరిగింది అని రాయకూడదు. అది తెలుగు కాదు. మనం అలా మాట్లాడం. మనం ఎలా మాట్లాడతామో అదే రాయాలి. మాట్లాడే భాషకి, రాసే భాషకి తేడా వుండకూడదు. “మనం పాఠకుడితో మాట్లాడుతున్నాం అనుకోవాలి. అలా అనుకుని రాయాలి,” అని.
  అది మొదటి పాఠం.
 అలాటి ఎన్నో పాఠాలు చెప్పేరాయన – సరళంగా రాయడం ఎంత అవసరమో.
“మనం మాట్లాడుతున్నపుడు చిన్న చిన్న పదాలతో
, చిన్న వాక్యాల్లో మాట్లాడతాం. మరి రాసినపుడు ఎందుకు కృతకంగా రాస్తాం? చిన్న వాక్యాల్లో కాకుండా పెద్ద పెద్ద వాక్యాల్లో విచిత్ర పదవిన్యాసాలు చేస్తాం,” అనేవారు.


No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...