April 25, 2016

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు

-బొల్లోజు బాబా
~

ఆధునిక ప్రపంచంలో నువ్వెవరవో ఎవరికీ అక్కరలేదు.  నువ్వేం చెపుతున్నావన్నదే ముఖ్యం.  ఆ చెప్పేది “వారికి” ఏ మేరకు మేలుచేస్తుందన్న దానిబట్టే నీ మనుగడ, నీ భద్రజీవితం.  ఇదొక అదృశ్య ఆధిపత్య పోరు.
ప్రముఖ కవయిత్రి,  మీనా కందసామి వ్రాసిన ఈ కవిత ఈనాటి రాజకీయ సామాజిక వాస్తవికతకు అద్దంపడుతుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు, అక్కడి వాసితులను బలవంతంగా తొలగించటానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న ఇద్దరు యువకులను, జనవరి 2015 లో అరెష్టు చేసింది ప్రభుత్వం.
అదీ ఈ కవితకు నేపథ్యం.
ఈ కవితలో ‘నిన్ను’ అన్న సంభోధనలోనే ఈ ప్రపంచంతో నీ మనుగడ ప్రశ్నార్ధకమైందన్న అంశం దాగిఉంది.  ఆ ‘నువ్వు’  లో ‘నేను’  లేను అనుకోవటం మనల్ని మనం మోసగించుకోవటమే. చివర్లో  నిశ్శబ్దమా వర్ధిల్లు అనటం ఈ సమాజం ప్రదర్శిస్తున్న నిర్లిప్తతపై గొప్ప వక్రోక్తి.

*******

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ ఇంట్లో ఏదో సమస్యాత్మక పుస్తకం ఉందని ఆధారం చూపుతారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పోలీసులు చెప్పారని ప్రసారమాధ్యమాలన్నీ నిన్ను తీవ్రవాది అనటాన్ని నీ మిత్రులు టివిలో చూస్తారు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు. లాయర్లందరినీ భయపెడతారు.  నీ కేసు తీసుకొన్న లాయర్ ఆ పైవారం అరెష్టు చేయబడతాడు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఆ మర్నాడు నిన్ను ఫేస్ బుక్ లో చూస్తారు నీ మిత్రులు.  పోలీసులే నీ పేరుతో ప్రవేశిస్తారు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  పిటిషన్ పై  వెయ్యి సంతకాలు తీసుకోవటానికి నాలుగురోజులు పడుతుంది నీ మిత్రులకు
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నీ చిట్టితల్లి UAPA  అంటే ఏమిటో తెలుసుకొంటుంది.  నీ మిత్రులకు సెక్షన్-13 అర్ధమౌతుంది.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ప్రజలకు నువ్వు ఒక లెఫ్టిస్ట్ వి,  లెఫ్టిస్ట్ లకు నువ్వు ఒక అతి-లెఫ్టిస్ట్ వి.  ఎవరూ మాట్లాడరు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఇకపై జీవితాంతం నీవు తీవ్రవాదిగానే పరిగణించబడతావు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  వాళ్ళు ఒక జాబితా తయారుచేస్తారు.  ఖండించినవారి పేర్లు అందులోకి చేరుతూంటాయి.

రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  నిన్ను హెచ్చరిస్తారు.  నీవే ప్రతిఒక్కరికీ ఒక హెచ్చరిక అవుతావు-  కార్పొరేట్ సాలెగూటిలో వేలుపెట్టినందుకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  ఈ రాత్రి నీ ఇల్లు సోదాచేస్తారు.  నిన్ను ప్రశ్నించటానికి తీసుకెళతారు.  మాట్లాడకు.
రేపు నిన్ను ఎవరో అరెష్టు చేస్తారు.  కోర్టు ఓ అరుదైన చర్యగా నీకు బెయిలిస్తుంది.  మరో కేసులో నువ్వు మళ్ళా అరెష్టు చేయబడతావు
రేపు  ఎవరో నీ పిల్లల్ని అరెష్టు చేస్తారు.  నీవు అజ్ఞాతంలోకి వెళిపోతావు.  ప్రజాస్వామ్యాన్ని బతికించటానికి కొన్ని జాగ్రత్తలు తప్పవు.

నిశ్శబ్దమా వర్ధిల్లు!


మూలం: మీనా కందసామి ( The End of Tomorrow)     – తెలుగు అనువాదం: బొల్లోజు బాబా (In Saaranga online literary magazine)http://magazine.saarangabooks.com/2016/04/21/%E0%B0%B0%E0%B1%87%E0%B0%AA%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81-%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8B-%E0%B0%85%E0%B0%B0%E0%B1%86%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81/

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...