August 26, 2016

అది హృదయమ్ము సుమ్మీ!

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?
అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.
***
ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.
***
ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!
ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.
అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.
ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.
అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పాడాల్సిందే.
రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.
ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు కాదు.  
తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.
దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.
అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.
ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.
అది హృదయమ్ము సుమ్మీ!
(Original link to the saaranga post: http://magazine.saarangabooks.com/2016/08/24/%E0%B0%B9%E0%B1%83%E0%B0%A6%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81-%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80/ )

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...