October 26, 2016

పూలగుర్తులు

పూలగుర్తులు



పూలమ్మిన చోటనే కట్టెలమ్మాల్సి వస్తుందని అందరూ చెప్పారు నేను పూల దుకాణం పెడుతుంటే. నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండివాణ్ని కాదు.
నా మేలు కోరి చెప్పిన వాళ్ల మాట కాదనలేను. అలాగని నా పుర్రెలో పుట్టిన ఐడియాను చంపుకోలేను. అందుకని ఉభయతారకంగా పూలదుకాణం పెట్టి పక్కనే మొక్కల నర్సరీ కూడా పెట్టాను. Say it with flowers (పూలిచ్చి మీ ప్రేమను ప్రకటించండి) అని షాపుకు పేరు పెట్టాను.
ఇంటర్నెట్‌ లేకపోతే ఎలా ఉండేదో కానీ, దాని పుణ్యమా అని బాగానే సంపాదిస్తున్నాను. ముఖ్యంగా అమెరికా, యూరోపు దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు తల్లిదండ్రుల్నీ, తోబుట్టువుల్నీ, చుట్టాల్నీ మరిచిపోలేదని చెప్పడానికన్నట్టు పూలు, బొకేలు ఆర్డర్లు పంపేవాళ్లు. అందుకోసం sayitwithflowers అన్న వెబ్‌సైట్‌ ఒకటి ఓపెన్‌ చేసాను.
నా షాపులో నేనందించే సర్వీసులు, మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, బ్రదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే, వేలంటైన్స్‌ డే ఇట్లాంటి దినాల వివరాలు పెట్టాను. నా వెబ్‌సైట్‌లో రిజిష్టర్‌ చేసుకున్న వాళ్లకు ఆయాదినాల గురించి ఇమెయిల్‌ ఎలర్ట్‌లు పంపే ఏర్పాటు కూడా చేశాను. అందువల్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి.
పూల షాపులోనే కాదు నర్సరీకి కూడా కస్టమర్లు బాగానే వస్తున్నారు.
మిగతా నర్సరీల్లా కాకుండా నేనేం చేసే వాడినంటే ఏ మొక్క కొంటే బాగుంటుందో చెప్పి కొనిపించే వాడిని. పూల మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లకు రకరకాల క్రోటన్‌ మొక్కల్ని వాటి ఆకుల అందాల్ని చూపించి కొనిపించే వాడ్ని.
కస్టమర్లతో మాట్లాడి వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి, వాళ్ల ఇళ్ల సైజులు బట్టి మొక్కల్ని సూచించేవాడ్ని. షాపు మధ్యలో రకరకాలుగా మొక్కల్ని అమర్చి చూపించేవాడ్ని. హాలు మధ్యలో మట్టి, ఇత్తడి పళ్లాల్లో నీళ్లు పోసి నాలుగు రకాల పువ్వుల్ని పెడితే ఎంత బాగుంటుందో చూపించి నాలుగైదు రకాల పూలమొక్కల్ని అమ్మేవాడ్ని.
నేను చెప్పేది కొందరికి నచ్చేది. కొందరికి నచ్చేది కాదు. కానీ వాళ్ల ఎంపికలో నేను చూపించే చొరవ మాత్రం నచ్చేది అందరికీ. కరివేపాకు మొక్క కొనడానికి వచ్చిన వాళ్లనీ, ఖరీదైన షోకు మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లనీ ఒకేలా చూసేవాడ్ని. దాంతో ఊళ్లో మొక్క కావలసిన వాళ్లెవరికైనా ముందు గుర్తుకు వచ్చేది నా షాపే.
షాపు పెట్టిన సంవత్సరంలో చాలమంది కస్టమర్లను చూసాను. బాగా డబ్బుండి టోకున మొక్కల్ని కొనేవాళ్లనీ చూసేను. ఒకే ఒక్క మొక్కని కొన్న వాళ్లనీ చూసాను. కానీ ఒక కస్టమర్‌ మత్రం అర్థమయ్యేవాడు కాదు. ఒకరోజు బంతిమొక్క కొంటే, ఇంకో రెండు రోజుల తర్వాత గులాబి మొక్కలు రెండు కొనేవాడు. కొన్ని సార్లయితే ఐదారు మొక్కలు కొనేవాడు.
అరవై ఏళ్లుంటాయి కావచ్చు. సాదా బట్టలు వేసుకునేవాడు. కొనుక్కున్న మొక్క లేదా మొక్కల్ని గుడ్డ సంచిలో వేసుకు వెళ్లేవాడు.
అతనొచ్చినప్పుడల్లా నా మొక్కల పరిజ్ఞానాన్నంతా ప్రదర్శించడానికి ప్రయత్నించే వాడ్ని. కానీ నా మాటల్ని పట్టించుకోకుండా తను కొనాల్సింది కొనుక్కు వెళ్లేవాడు. నాకు క్రమక్రమంగా ఈ కస్టమర్‌ మీద ఆసక్తి మొదలైంది. అందుకే అతడెప్పుడొచ్చినా ఏం కొన్నా జాగ్రత్తగా గమనించే వాడిని. గమనిస్తున్న కొద్దీ నాకాయన మీద ఉత్సుకత పెరిగిందే గానీ తగ్గలేదు. ఒక్కోసారి వారాల తరబడి వచ్చేవాడు కాదు. అసలు ఇన్ని మొక్కలు ఏం చేస్తున్నాడు? మళ్లీ ఎవరికైనా అమ్ముకుంటున్నాడా?
“ఈసారొచ్చినపుడు అతడిని వెంబడించి వెళ్లాలి” అని అనుకున్నాను.
నేనలా అనుకున్న కొన్ని రోజులకు రానే వచ్చాడు. అయితే ఎప్పటిలా ఒక్కడే కాకుండా ఐదారేళ్ల బాబును వెంట తీసుకొచ్చాడు ఒక రోజు మధ్యాహ్నం. మనిషి ఎప్పటికంటే గంభీరంగా ఉన్నాడారోజు. బంతీ, చామంతీ, గులాబీ – అన్నీ కలిపి ఏకంగా ఎనిమిది మొక్కలు కొన్నాడు.
కౌంటర్లో కూచున్న నా దగ్గర కొచ్చాడు డబ్బులియ్యడానికి. అతను తీసుకున్న మొక్కల్ని చూస్తూ చిన్న కాగితం మీద ఎంతయిందో లెక్కవేసి చెప్పాను. అతను పాంట్‌ జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి నాకు ఇవ్వాల్సినవి తీసిచ్చాడు.
“ఎవరూ? మనవడా?” అనడిగాను.
“అవున”న్నాడు.
నేనేం మాట్లాడకుండానే తనే అన్నాడు. “కూతురు కొడుకు. టౌన్‌లో ఉంటారు. వాడు పుట్టాక ఇదే రావడం”.
కాలర్‌ ఉన్న తెల్లటీషర్ట్‌, నల్లటి నిక్కర్‌ వేసుకున్నాడు.
ఈ పూల మొక్కల షాపులో వాడొక తెల్లగులాబీ పువ్వులా ఉన్నాడు.
“నీ పేరేంటీ?” అనడిగాను.
ముద్దుముద్దు గొంతుతో ‘రమాకాంత్‌’ అన్నాడు.
నాకు రావాల్సిన డబ్బులు తీసుకుని చిల్లర ఇచ్చేను.
డబ్బులు జేబులో పెట్టుకుని షాపు బయటకు నడిచేరిద్దరూ.
వాళ్లలా బయటకు వెళ్లగానే నా అసిస్టెంట్‌ను పిలిచేను. ‘కాసేపు బయటకు వెళ్లొస్తాను, షాపు చూడమ’ని చెప్పి బయటకెళ్లి చూసేను. ఒక చేత్తో మొక్కల సంచిని మరో చేత్తో మనవడి చేతిని అపురూపంగా పట్టుకుని అతడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్లు ఇంకొంచెం దూరం వెళ్లేదాకా ఆగి వారిని అనుసరించాను.
టైం నాలుగవుతుంది. పడమరకు వాలుతున్న ఎండలో తాతా మనవళ్ల నీడలు తూర్పున పడుతున్నాయి. మనవడు ఏదో అడిగినట్టున్నాడు, అటువైపు తిరిగి ఏదో చెబుతున్నాడు. తలపైకెత్తి తాత మొహంలోకి చూసి మళ్లీ ఏదో అడిగాడు మనవడు. రోడ్డుమీద వాహనాల చప్పుడులో వాళ్ల మాటలు అక్కడే గాలిలో కలిసిపోతున్నాయి.
వాళ్లలా రెండు మూడు వీథులు దాటి చెరువు పక్క పెంకుటింటి పక్కన ఆగారు. నేపాళం కర్రలతో కట్టిన దడి తలుపు తీసుకుని లోపలికెళ్లారు. వాళ్లు లోపలికెళ్లే దాకా ఆగి నేనూ అటువైపు వెళ్లాను, చెరువువైపు వెళ్తున్నట్టు. వాళ్ల గేటు దగ్గరకు చేరుకోగానే తలతిప్పి వాళ్ల ఇంటివైపు చూసాను. ఇంటిముంది అరుగుమీద రెండు కుర్చీలు ఉన్నాయి. ఒక మూల గాదె ఉంది. మెల్లగా గేటు తీసి లోపలికెళ్లాను. ఇంటి తలుపు సగం తెరచి ఉంది. ఎదురుగా ఉన్న గోడమీద ఒక యువకుడి ఫొటో వేళ్లాడుతోంది.
ఇంటి పక్క ఖాళీ ప్రదేశంలో ఏదో మాటల అలికిడి వినిపించడంతో అటువైపు వెళ్లాను. గోడ దగ్గర ఆగిపోయి చూసాను. దాదాపు ఇల్లెంత ఉందో ఖాళీ ప్రదేశం అంతే ఉంది. అక్కడక్కడా పూల మొక్కలు, చిన్నవీ పెద్దవీ ఉన్నాయి. బుల్లి రమాకాంత్‌ గొంతుకిలా కూచుని సంచిలోంచి మొక్కలు బయటకు తీస్తున్నాడు. పెరట్లోని పాకలోంచి బూరిగె తీసుకొచ్చి మనవడి దగ్గరపెట్టి నుయ్యి దగ్గరకెళ్లి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చాడు తాత.
అక్కడక్కడా నీళ్లు పోసీ చిన్న చిన్న గోతులు తవ్వుతూ ఒక్కొక్క మొక్కా పాతుతున్నారు ఆ ఇద్దరూ. చల్లటి గాలికి ఆ చిన్న పూతోటలో మొక్కలు – రకరకాల రంగులవీ, వాసనలవీ – మెల్లగా హాయిగా విలాసంగా వూగుతున్నాయి.
“వీటికి నువ్వు రోజూ నీళ్లు పోయాలి నువ్వు ఉన్నన్ని రోజులు” అన్నాడు తాతయ్య.
“పోస్తాను గానీ తాతయ్యా, ఇన్ని మొక్కలెందుకు తాతయ్యా,” అనడిగాడు మనవడు.
ఆ ప్రశ్న విన్నాడో లేకపోతే పనిలోపడి ఆ మాటలు పట్టించుకోలేదో తెలీదు కానీ కాసేపు ఏమీ మాట్లాడలేదు తాత. అప్పుడే పాతిన మొక్క మొదలు దగ్గర కొంచెం మట్టి పోసి రెండు చేతులతో ఒత్తాడు.
“అసలిన్ని మొక్కలెందుకు కొన్నావు తాతయ్యా” అని మళ్లీ అడిగాడు రమాకాంత్‌.
“ఈ రోజు పొద్దున్నే ఎనిమిది మంది చనిపోయారు నీ కోసం, నా కోసం. మీ కోసం చనిపోయిన వాళ్ల కోసం మీరేం చేశారని ఎవరైనా అడిగారనుకో, ఇవి చూపిద్దాం. ఇక్కడ పూసే పూలగాలుల్లో వాళ్లు మన కళ్లల్లో మెదుల్తుంటారు,” అన్నాడు తాతయ్య.
అతడి మాటలు వింటూ పెరడంతా చూసాను. సాయంత్రపు నీరెండలో పువ్వులు కొత్త కొత్త రంగులు ప్రకటిస్తున్నాయి. నాకిప్పుడు ఆ మొక్కలు నాకు డబ్బులు కురిపించే చెట్లలాగా అనిపించడం లేదు. కొత్త ప్రాణం పోసుకున్నట్టు తోస్తున్నాయి. ఎవరెవరివో జ్ఞాపకాలకు గుర్తులుగా కనిపిస్తున్నాయి. మెల్లగా బయటకొచ్చి షాపు చేరుకున్నాను.
ఒకరోజు పొద్దున్నే పేపరు తీసి ఒక వార్త చదువుతుంటే అనిపించింది. ఈ రోజు తప్పకుండా అతడు నా షాపుకు వస్తాడనిపించింది. షాపు తెరచిన కాసేపటికి నేననుకున్నట్టుగానే వచ్చాడు. అతడికోసమే రడీగా పెట్టుకున్న గడ్డి గులాబీ మొక్కొకటి తీసి అతడి చేతిలో పెట్టాను. వద్దనలేదు. ఇంకోమొక్క వెతుక్కునే ప్రయత్నమూ చెయ్యలేదు. అతడి కళ్లలోకి చూసాను. ఉబికి వచ్చి కనుగుడ్లపై ఆగిపోయిన కన్నీళ్లు కనిపించాయి.
(మాధవ్‌, రజిత, రవి, ప్రసాద్‌లకు ఇంకా ‘అనేకానేక మందికి) (July, 2007, Online Literary Magazine -- Pranahita)
(Now, for those 31 killed in AOB)


October 20, 2016

తల్లి భూదేవి - మట్టి మనుషుల జీవితమూ, యుద్ధమూ

ఎన్నో పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని పుస్తకాలు, అందులో కొన్ని పాత్రలు మాత్రం జీవితాంతం వెంటాడుతూంటాయి. అలాటి పుస్తకాలలో ʹతల్లి భూదేవిʹ (Mother Earth) ఒకటి. అలా వెంటాడే పాత్రల్లో తొల్గొనాయ్, అలిమన్ లు.

డెబ్భైల్లో, ఎనభైల్లో విప్లవోద్యమాల్లోకి, వామపక్ష ఉద్యమాల్లోకి వచ్చినవాళ్లు ఈ పుస్తకం చదవకుండా రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విప్లసాహిత్య శిబిరాల్లో మొట్టమొదట చదవాల్సిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. ఒకసారి ఈ పుస్తకం చదివితే ఇందులోని పాత్రలు, తొల్గొనాయ్, అలిమన్, మనకు ఆప్తులు అయిపోతారు. మన నిజ జీవితాల్లో అలాటివాళ్ళు మనకి ఎక్కడో ఓ సారి మనకి తారసపడే వుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ బాధలు, జీవితమ్మీద, మనుషులమీద ప్రేమతో వాళ్ళు మాట్లాడే మాటలు, సత్యం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు -- మరెప్పటికీ మనమీద చెరగని ముద్ర వేస్తాయి.
చింగీజ్ ఐత్ మాతొవ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లోని కిర్గిజ్ ప్రాతానికి చెందిన గొప్ప రచయిత. రష్యన్ విప్లవం విజయవంతమైన తర్వాత పుట్టిన తరానికి చెందిన వాడు. తన ముందరి తరాల రచయితలు, విప్లవానికి, రష్యన్ సమాజానికి దారిచూపించిన మహా రచయితలైన చెహోవ్, గోర్కీ, టాల్ స్టాయ్, మైకోవిస్కి వంటి గొప్ప రచయితల వారసత్వాన్ని కొనసాగించినవాడు..........
The Link to the Original article.
http://virasam.in/article.php?page=283

October 05, 2016

ఈ పుస్తకం చదివేరా?

http://virasam.in/article.php?page=269

కొందరి రచయితలు రాసిన కొన్ని పుస్తకాలు మహా గ్రంథాలుగా నిలిచిపోతాయి. శ్రీ శ్రీ అనగానే మహాప్రస్థానం, పతంజలి అనగానే వీరబొబ్బిలి, రాజయ్య అనగానే కొలిమంటుకున్నది, జాషువ అనగానే గబ్బిలం, కారా అనగానే యజ్ఞం మనకు గుర్తొస్తాయి. ఈ గుర్తుకురావడం ఎంతవరకూ పోయిందంటే వాళ్ళు రాసిన ఇతర రచనలేవీ రచనలుగా పరిగణించనంతగా. 
దీనివల్ల నష్టం మనకే గానీ వాళ్లకి కాదు. ఒక్క పుస్తకం చదవకుండా వదిలేసామంటే ఒక గొప్ప అనుభవాన్ని వదిలేసుకుంటున్నట్టే. ముఖ్యంగా రచయితలు squander చేసుకుంటున్నది అంతాఇంతా కాదు........

October 02, 2016

జలగలు

నెలమొత్తం కష్టపడి టైమూ, డబ్బులూ చూసుకుని ఒక్క సినిమా చూద్దామని వెళ్తామా, అదే మన నెత్తిన భస్మాసుర హస్తమవుతుంది. 

రాత్రి తెర కనిపించిన వాళ్ళు పొద్దున్నకల్లా టీవీల్లోకి, హోర్డింగుల మీదికి, పత్రికల్లోకి, ఫేస్బుక్కుల్లోకి, ట్విట్టర్లలోకి ప్రత్యక్షమవుతారు. 

అది కొని దాహం తీర్చుకో, ఈ బట్టలు కొనుక్కో, ఆ టీవీ కొను, ఆ షాపులో బంగారం కొను, ఇక్కడ తాకట్టు పెట్టు, ఫలానా చోట ఇల్లు కొను, ఫలానా పార్టీ వాడికి ఓటెయ్యి, ఈ పౌడరు కొను, ఆ సబ్బు కొను, ఈ నూడుల్స్ తిని చూడు, ఆ లాగు కొనుక్కో, తలకి ఆ కంపెనీ వాడి రంగేసుకో -- అని వెంటాడుతుంటారు. 
వాళ్ళు బహుశ పక్కపక్క ఇళ్లల్లోనే వుంటారు. తరుగు భారం లేని బంగారం కొనమంటాడొకడుడు. తర్వాత తాకట్టుపెట్టమంటాడొకడు. పాత సామాన్లు అమ్మేసి తాజా సామాన్లు కొనుక్కోమంటాడొకడు. ఒకషాపులో బంగారం కొనమని తండ్రి చెప్తాడు, పక్క షాపులో సూట్లు కొనుక్కోమని  కొడుకు చెప్తాడు. అదే షాపులో పట్టుచీరలు కొనుక్కోమని కాబోయే కోడలు చెప్తుంది.
ఇంకొకడు రమ్మీ ఆడమంటాడు, ఇదిగో కొంచెం బోనస్ ఇస్తున్నా ఆడి చూడు మజా వస్తుందంటాడు. ఇంకొకడు చల్ల చల్లటి నూనె కొనుక్కోమంటాడు. మరొకడు మరొకటి అంటాడు.
కొందరు వస్తువులకీ, మరికొందరు పార్టీలకీ ప్రచారం  చేస్తారు. ఆ మురిపాలు చూసి, ఆ హొయలు చూసి, ఆ తొడగట్టే ఆవేశాలు చూసి -- ఇల్లూ, వళ్ళూ పాడు చేసుకుని దివాళా తీసి కుదేలై ఉంటాం మనం. వాళ్లు మాత్రం ఎప్పుడూ తళ తళా మెరుస్తుంటారు. ఎగిరే జుత్తు చూసి, వస్తువుల కోసం వాళ్ళు వడుపుగా చేసే విన్యాసాల గురించి మనం అచ్చెరువొందుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ ఒక్క గాడిద కూడా ఈ నెలంతా వర్షాలు పడ్డాయి, వరదలొచ్చాయి ఏం తిని బతుకుతున్నారు? దిక్కుమాలిన రోడ్లమీదపడి రోజులు ఎలా వెళ్లదీస్తున్నారు? రోజులు గడుస్తున్నాయా? డెంగీ జబ్బుల బారిన పడి మీ పిల్లలు ఎలా లుగుతున్నారు,  అని అడగరు. తొడలుగొట్టరు, గర్జించరు. జాబులు ఇస్తామన్న వారు జాబులు ఇచ్చారా అని అడగరు. 

కానీ, కోకులు తాగండి, నూనెలు వాడండి, నూడుల్స్ తినండి, బంగారం కొనండి, ఆ నాయకుడికి ఓటెయ్యండి  అంటూ వాళ్ళు చేసే ప్రచారం ఆగదు.
మన జేబుల్లో డబ్బులన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతాయి. మన మీద పెత్తనమంతా వాళ్ళు ప్రచారం చేసిన వస్తువలకి, నాయకులకి వెళ్ళిపోతుంది.
దుర్భరమైన ఈ జీవితం నుంచి కొంచెం సాంత్వన కోసం ఓరోజు సాయంత్రం సినిమాకి వెళ్తాం. 
 

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...