October 02, 2016

జలగలు

నెలమొత్తం కష్టపడి టైమూ, డబ్బులూ చూసుకుని ఒక్క సినిమా చూద్దామని వెళ్తామా, అదే మన నెత్తిన భస్మాసుర హస్తమవుతుంది. 

రాత్రి తెర కనిపించిన వాళ్ళు పొద్దున్నకల్లా టీవీల్లోకి, హోర్డింగుల మీదికి, పత్రికల్లోకి, ఫేస్బుక్కుల్లోకి, ట్విట్టర్లలోకి ప్రత్యక్షమవుతారు. 

అది కొని దాహం తీర్చుకో, ఈ బట్టలు కొనుక్కో, ఆ టీవీ కొను, ఆ షాపులో బంగారం కొను, ఇక్కడ తాకట్టు పెట్టు, ఫలానా చోట ఇల్లు కొను, ఫలానా పార్టీ వాడికి ఓటెయ్యి, ఈ పౌడరు కొను, ఆ సబ్బు కొను, ఈ నూడుల్స్ తిని చూడు, ఆ లాగు కొనుక్కో, తలకి ఆ కంపెనీ వాడి రంగేసుకో -- అని వెంటాడుతుంటారు. 
వాళ్ళు బహుశ పక్కపక్క ఇళ్లల్లోనే వుంటారు. తరుగు భారం లేని బంగారం కొనమంటాడొకడుడు. తర్వాత తాకట్టుపెట్టమంటాడొకడు. పాత సామాన్లు అమ్మేసి తాజా సామాన్లు కొనుక్కోమంటాడొకడు. ఒకషాపులో బంగారం కొనమని తండ్రి చెప్తాడు, పక్క షాపులో సూట్లు కొనుక్కోమని  కొడుకు చెప్తాడు. అదే షాపులో పట్టుచీరలు కొనుక్కోమని కాబోయే కోడలు చెప్తుంది.
ఇంకొకడు రమ్మీ ఆడమంటాడు, ఇదిగో కొంచెం బోనస్ ఇస్తున్నా ఆడి చూడు మజా వస్తుందంటాడు. ఇంకొకడు చల్ల చల్లటి నూనె కొనుక్కోమంటాడు. మరొకడు మరొకటి అంటాడు.
కొందరు వస్తువులకీ, మరికొందరు పార్టీలకీ ప్రచారం  చేస్తారు. ఆ మురిపాలు చూసి, ఆ హొయలు చూసి, ఆ తొడగట్టే ఆవేశాలు చూసి -- ఇల్లూ, వళ్ళూ పాడు చేసుకుని దివాళా తీసి కుదేలై ఉంటాం మనం. వాళ్లు మాత్రం ఎప్పుడూ తళ తళా మెరుస్తుంటారు. ఎగిరే జుత్తు చూసి, వస్తువుల కోసం వాళ్ళు వడుపుగా చేసే విన్యాసాల గురించి మనం అచ్చెరువొందుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ ఒక్క గాడిద కూడా ఈ నెలంతా వర్షాలు పడ్డాయి, వరదలొచ్చాయి ఏం తిని బతుకుతున్నారు? దిక్కుమాలిన రోడ్లమీదపడి రోజులు ఎలా వెళ్లదీస్తున్నారు? రోజులు గడుస్తున్నాయా? డెంగీ జబ్బుల బారిన పడి మీ పిల్లలు ఎలా లుగుతున్నారు,  అని అడగరు. తొడలుగొట్టరు, గర్జించరు. జాబులు ఇస్తామన్న వారు జాబులు ఇచ్చారా అని అడగరు. 

కానీ, కోకులు తాగండి, నూనెలు వాడండి, నూడుల్స్ తినండి, బంగారం కొనండి, ఆ నాయకుడికి ఓటెయ్యండి  అంటూ వాళ్ళు చేసే ప్రచారం ఆగదు.
మన జేబుల్లో డబ్బులన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతాయి. మన మీద పెత్తనమంతా వాళ్ళు ప్రచారం చేసిన వస్తువలకి, నాయకులకి వెళ్ళిపోతుంది.
దుర్భరమైన ఈ జీవితం నుంచి కొంచెం సాంత్వన కోసం ఓరోజు సాయంత్రం సినిమాకి వెళ్తాం. 
 

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...