July 10, 2017

మనుషుల్ని ప్రేమించినవాడు

"మీరిలా కలవడం చాలా బాగుంది లేదా మీరిలా మాట్లాడడం చాలా బాగుంది," అనేవారు డా. వి  చంద్రశేఖర రావు కలుసుకున్న ప్రతి సందర్భంలోనూ.  
కలుసుకోవడం, మాట్లాడుకోవడం అరుదైన రోజుల్లో కలవడం లేదా మాట్లాడడం దానికదే గొప్పదని, ఆ క్షణాలని పొదివి పట్టుకునేవారు. ఆ సంతోషాన్ని అలా ప్రకటించేవారు కూడా.
కలిసిన ప్రతిసందర్భంలో మన దృష్టిలో ఒక అడుగు పైకి ఎక్కేవాళ్ళు వుంటారు. కలిసిన ప్రతి సందర్భంలో మన దృష్టిలో ఒక అడుగు దిగిన వాళ్ళుంటారు. చంద్రశేఖర రావుగారితో కలిసిన ప్రతిసందర్భమో, మరో సందర్భం ఉంటే బాగుండుననే కోరిక మిగిల్చేది. రమణ గారన్నట్టు ప్రశాంతతకి పెద్దన్నయ్యలా అనిపించేది. 
రైల్ నిలయంలో ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినపుడు, కారిడార్ లో ఆయన నేమ్ ప్లేట్ చూసి వెళ్ళేను. "మీరిలా రావడం చాలా బాగుంది," అన్నారు. అది ఆయనకు దాదాపు ఊత పదం.  మనుషుల్ని కలవడం అంత ఇష్టం ఆయనకు.  
"ఫలానా కథ ముగింపు అలా కాక ఇలా బాగుండేదనుకున్నా," అన్నారొకసారి. 
"నాకు అప్పుడు అలా తోచింది," అన్నాను.
"అవును. రచయితకు తోచినట్టే ముగించాలి," అన్నారు. 
'జీవని' కథ విన్నపుడు ఒక విభ్రమ. ఆ కథన పద్దతిని బ్రేక్ చేసి లెనిన్ ప్లేస్ కథల ప్రయాణం మరో విభ్రమ. లెనిన్ ప్లేస్ కథల తర్వాత ఆయన రాసిన చాలా కథలపై నాకు  భిన్నాభిప్రాయాలుండేవి. అక్కడక్కడా కనిపించిన గ్లూమీ వాతావరణం నాకు ఉక్కపోతగా ఉండేవి. 
కానీ, ఆయన ఆ వస్తువుల్ని డీల్ చేసే పధ్ధతి విపరీతంగా నచ్చేది. మనకో మార్క్వెజ్, మనకో కాఫ్కా వున్నాడు కదా అని గర్వంగా అనిపించేది. 
 ఆయన అలా రాస్తున్నప్పుడు, లేదా ఒక ఆలోచనని ఒక రిడిల్ లాగ ఒక చోట వదిలినపుడు దాన్ని అర్ధంచేసుకునే ప్రయత్నం, ఆ ప్రయాణం gratifying గా ఉండేది. ఆ కథ చదవడం, It is an experience in itself.
8,9 కర్నూల్ లో విరసం కథల వర్క్ షాప్ లో ఉండగా వెంకటక్రిష్ణ చంద్రశేఖర రావుగారి మరణవార్త ప్రకటించారు. ఆ రెండు రోజులూ, ఇప్పుడూ ఆయన, ఆయన కథల్లోని పాత్రలు, ఆయన కథల్లోని వాతావరణం కళ్ళ ముందు కదులుతోంది. I think that's where we are all living and will relive thru his writings. He lives on.
-- కూర్మనాథ్ 

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...