January 27, 2018

మాటలో ఏముంది? ఉన్నదంతా విరుపులోనే!


పదాలలో పరుషపదాలు వేరు కావు.
అవి ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడతామో పరుషమా కాదా అన్నది తేలుతుంది. 

కాలేజీరోజుల్లో, మా సుబ్బారావుని ఓసారి, "ఒరే, నిన్ను నేను కుళ్ళు రాజకీయాలు చేసే ఫలానా నాయకుడి పేరుతో పిలుస్తా జాగ్రత్త," అని హెచ్చరించా. 
విలవిల్లాడి పోయాడు పాపం.
కొంచెం సేపటికే తేరుకుని, "నువ్వు నన్నలా పిలిస్తే, నిన్ను ఇంకో ఫలానా దగుల్భాజీ నాయకుడి పేరుతొ పిలుస్తా," అన్నాడు.
కొన్నిసార్లయితే వాడొకపేరుతో నన్నంటే, వాడినొక పేరుతో నేను కోపం తీరా తిట్టుకునేవాళ్ళం. పేర్లు వెతుక్కుని మరీ తిట్టుకునే వాళ్ళం కసితీరా. కానీ అవేవీ పరుషపదాలు కావు. కేవలం పేర్లు.
ఇంకొన్ని సందర్భాల్లో అదే నాయకుల పేర్లతో పిలిస్తే ఆనాయకుడి అభిమానులు పొంగిపోయి మనకు మాంఛి దమ్ బిర్యానీ కూడా తినిపించవచ్చు. 
ఉదాహరణకు, ఎవరైనా కేసీయార్ అభిమానిని "నువ్వు కేసీయార్ లా మాట్లాడుతున్నావు," అన్నామనుకోండి, ఆయనకి అది చాలా పెద్ద కితాబు. పొంగిపోతాడు. లేదా, చంద్రబాబు అభిమానినో, జగన్ అభిమానినో, మోడీ అభిమానినో, పవన్ కళ్యాణ్ అభిమానినో ఆయా పేర్లతో పిలిస్తే ఉబ్బితబ్బిబ్బవుతారు. 
అదే, వాళ్ళ విమర్శకులని, చికాకు పడేవాళ్ళను ఆ పేర్లతో పిల్చామనుకోండి అదో పెద్ద తిట్టు. వాళ్లకు వళ్ళు మండిపోతుంది. కోపంతో ఊగిపోతారు. పట్టరానంత ఆగ్రహం కలగొచ్చు మనమీద. 
మా అప్పలస్వామికి వళ్ళంతా వెటకారమే. "దర్మ పెబువు. ఈ భూపెపంచకమ్మీద నీలాటోడు పుట్టలేద," నేవాడు సర్పంచినుద్దేశించి.
ఎవరైనా మొండి వాదన చేస్తుంటే, "ఒల్లకోర నాయన. నీకో దండం," అనేవాడు. అలా అన్నప్పుడు, రెండుచేతులు పైకెత్తి, ఆ చేతుల్లో ములిగిపోయేటట్టు తలని వంచేవాడు.
మాటలలో ఎక్కడా పరుషమైన పదాలుండేవి కావు. ఆ పదాలని విరవడంలో, పలకడంలో, ఆహార్యంలో చూపించేవాడు తనలోని కసినంతా. ఆ వెటకారానికి  అవతలివాడు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. మనిషైతే. 
గీచిగీచి బేరమాడి అసంబద్ధ ధరలకు పళ్ళూ కాయకూరల్ని కొనాలనుకునే మధ్యతరగతి కొనుగోలుదార్లను 'చదువూ సంధ్యా' లేని అమ్మకం దార్లు మర్యాదపూర్వకమైన పదాలతోనే ఎలా ఆడుకుంటారో అందరికీ తెలుసు. 
బహుశా, ఇలాటి అథోజగత్ అలగా జనాల హాస్యచతురత, వెటకారంతో ఉప్పూకారంపెట్టి మాటలతో కోసేసే నేర్పునే గురజాడ కన్యాశుల్కంలో వాడివుంటారు. మధ్యతరగతివాళ్ళ అహాన్ని దెబ్బతీయని మర్యాదపూర్వక పదాలువాడుతూనే 'మధురవాణి' గిరీశం లాటి అవకాశవాదుల్ని, రామప్పంతుల్లాంటి గుంటనక్కల్ని ఉతికి ఆరేస్తుంది. 
మామూలు పదాలతో, సాదాసీదా వ్యక్తీకరణలతో అస్సలే పరుషపదాలు లేకుండా కుటిలత్వాన్ని ఎండగడతారు ప్రజలు. ఎటువంటి సానుభూతీ  దయా చూపించరు వాళ్ళు లేకి మనుషులమీద, దుర్మార్గమైన నాయకులమీద, అన్యాయమైన వ్యవస్థమీద.
పరుషపదాలని నిషేధిస్తే ప్రజలు మిమ్మల్ని విమర్శించకుండా ఉండిపోరు. మిమ్మల్ని తిట్టకుండా ఉండిపోరు. వాళ్ళు బంతిపువ్వులాటి, దూదిలాటి మెత్తటి పదాలనే వాడతారు. పక్షి ఈకలాటి తేలికైన పదాలనే వాడతారు. వాటిని  వడిసెలలో ఒడుపుగా ఇమిడ్చి కసితీరా విసురుతారు. 
ఇక ఆ మాటలు తగిలి గిలగిలా కొట్టుకోవాల్సిందే -- దయగల ధర్మప్రభువులు. 
మాటలో ఏముంది? ఉన్నదంతా విరుపులోనే!

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...